*పగటివేళ లాక్‌డౌన్ ఎత్తివేత*
*ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు సడలింపు*
*సాయంత్రం 6 - ఉదయం 6 మధ్య కఠిన ఆంక్షలు..*
*రేపటినుంచి అమలు*
*కరోనా తగ్గని ఏడు నియోజకవర్గాల్లో పాత నిబంధనలే*
తెలంగాణలో పగటిపూట లాక్‌డౌన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం ప్రగతిభవన్‌లో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు తగ్గిన ప్రాంతాలన్నింటిలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్‌డౌన్‌ను సర్కారు సడలించింది. 5 గంటలకు అన్ని దుకాణాలు, వాణిజ్య సముదాయాలు మూసివేయాలి. తర్వాత గంటసేపు అంటే 6 గంటల వరకు ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులుబాటు కల్పించింది. సాయంత్రం ఆరు గంటల నుంచి మర్నాడు ఉదయం ఆరు గంటల వరకు లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని పోలీసుశాఖను ఆదేశించింది. ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు ఇది అమల్లో ఉంటుంది. కరోనా పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చే వరకు రాత్రిపూట ఆంక్షలు అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. కేసుల సంఖ్య తగ్గితే దశలవారీగా నెలాఖరు నాటికి పూర్తిగా లాక్‌డౌన్ ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. కరోనా పూర్తిగా అదుపులోకి రాని.. సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాల పరిధిలో మాత్రం ప్రస్తుత లాక్‌డౌన్ నిబంధనలే కొనసాగుతాయి. ఈ ఏడు నియోజకవర్గాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపు... గమ్యస్థానాలకు చేరుకునేందుకు మరో గంట అంటే మధ్యాహ్నం రెండు గంటల వరకు వెసులుబాటు కొనసాగించాలని తీర్మానించింది. సీఎం ఆదేశాలతో ఈ ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర వైద్యాధికారుల బృందం సిఫార్సుల మేరకు యథాతథంగా ఆంక్షలు కొనసాగించాలని మంత్రిమండలి నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గిందని వైద్యఆరోగ్యశాఖ నివేదిక ఇవ్వగా... ఆంక్షలతో ఆదాయానికి గండి పడిందని స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా, ఆబ్కారీ, రెవెన్యూ శాఖలు నివేదించాయి. వీటిని పరిశీలించిన ప్రభుత్వం, పగటిపూట వ్యాపార కార్యకలాపాలకు మరికొంత సమయం పెంచింది.
*పూర్తిస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు*
లాక్‌డౌన్ సడలింపుల దృష్ట్యా ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి లేదని పేర్కొంది. మంత్రిమండలి నిర్ణయాల మేరకు తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఆర్టీసీ, సెట్విన్, ఆటోలు, క్యాబ్‌లు సహా అన్ని రకాల ప్రజారవాణాకు అనుమతిచ్చిన ప్రభుత్వం.. అంతర్రాష్ట్ర సర్వీసులను రద్దు చేసింది. వైద్యఆరోగ్యం సహా అత్యవసర సేవలను లాక్‌డౌన్ నుంచి మినహాయించింది. సినిమా హాళ్లు, వినోదపార్కులు, బార్లు, పబ్బులు, క్లబ్బులు, జిమ్‌లు, ఈతకొలనుల కార్యకలాపాలను నిషేధించింది. పెళ్లిళ్లకు 40 మంది, అంత్యక్రియలకు 20 మందే హాజరు కావాలని సూచించింది. జాతీయ రహదారులపైనున్న పెట్రోలు బంకులు 24 గంటలూ పనిచేస్తాయి. మిగిలిన బంకులు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడుస్తాయని పేర్కొంది.
_*🗞️🇮🇳సత్యమేవ జయతే 🇮🇳🗞️*_
No comments:
Post a Comment